Telangana Weather Report : తెలంగాణలో ఒక్కసారిగా పెరిగిన చలి తీవ్రత ప్రజలను వణికిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 5 నుంచి 13 డిగ్రీల మధ్యకు పడిపోవడంతో జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు వంటి ‘చలి జ్వరం’ లక్షణాలు ఇంటింటా కనిపిస్తున్నాయి. బయట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువకు పడితే శరీర ఉష్ణ నియంత్రణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల రక్తనాళాలు కుంచించుకుపోయి బీపీ పెరగడం, గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాలు ఎక్కువయ్యే అవకాశం ఉందని తెలిపారు. రానున్న రోజుల్లో కూడా ఇదే చలి పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
చలిని తట్టుకోవడానికి మద్యం తాగడం ప్రమాదకరమని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అది తాత్కాలికంగా వెచ్చదనం ఇచ్చినా, తరువాత హైపోథెర్మియా వంటి ప్రాణాంతక పరిస్థితులకు దారితీయవచ్చు. గోరువెచ్చని నీరు తాగడం, స్వెట్టర్లు, మఫ్లర్లు, గ్లౌజులు వాడటం, ముక్కు–చెవులకు చలి గాలి తాకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. శ్వాసకోశ సమస్యలున్నవారు ఆవిరి పట్టడం, రోగ నిరోధక శక్తి పెంచే ఆహారం తీసుకోవడం అవసరం. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, ఆస్తమా రోగులు మరింత అప్రమత్తంగా ఉండాలని, స్వల్ప లక్షణాలున్నా నిర్లక్ష్యం చేయవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

