TGSRTC Ticket Booking : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ప్రయాణికుల సౌలభ్యం కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై బస్సు టికెట్లను 60 రోజుల ముందుగానే అడ్వాన్స్‌గా బుక్ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ సదుపాయం గతంలోనూ ఉన్నప్పటికీ, చాలా మంది ప్రయాణికులకు దీని గురించి అవగాహన లేకపోవడంతో, ముఖ్యంగా దసరా, దీపావళి వంటి పండుగల సీజన్‌లో ఈ అవకాశాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్లు టీజీఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు. దీంతో ప్రయాణికులు ముందుగానే తమ ప్రయాణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవచ్చు.
ప్రయాణికులను మరింత ఆకర్షించేందుకు టీజీఎస్ఆర్టీసీ అనేక కొత్త చర్యలు తీసుకుంటోంది. పండుగ సమయాల్లో లక్కీ డ్రా స్కీమ్‌లు, ‘గమ్యం’ యాప్ ద్వారా బస్సుల లైవ్ లొకేషన్ సౌకర్యం, ఏసీ సీటర్-స్లీపర్ బస్సుల విస్తరణ, విమానయాన స్థాయి సమాచార సేవలు (సర్వీసు వివరాలు, స్టాపులు, ప్రయాణ సమయం ముందుగా తెలియజేయడం) వంటి సౌకర్యాలను అందిస్తూ ప్రయాణికులకు మరింత చేరువవుతున్నట్లు పేర్కొంది.

